ప్రతి సంవత్సరం ఆగస్టు 29 జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటాం. విజర్డ్ ఆఫ్ హాకీ గా పిలువబడే హాకీ ప్లేయర్ మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినాన్ని పురస్కరించుకుని 2012లో భారత ప్రభుత్వం ఈ రోజును జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది. మేజర్ ధ్యాన్ చంద్ హాకీకి చేసిన గణనీయమైన కృషి మన దేశానికి ఎనలేని గౌరవాన్ని తెచ్చిపెట్టింది. 1928, 1932, 1936 జరిగిన ఒలింపిక్స్‌లో భారతదేశం సాధించిన బంగారు పతకాలలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఎందరో క్రీడా కారులకు స్పూర్తి దాయకంగా నిలిచిన ధ్యాన్ చంద్ ను గుర్తుచేసుకుంటూ దేశమంతటా జాతీయ క్రీడా దినోత్సవాలు నిర్వహిస్తారు.ప్రతిష్టాత్మక మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు దేశంలోనే అత్యున్నత క్రీడా గౌరవంగా పరిగణిస్తారు. పాఠశాలలు, కళాశాలలు అనేక క్రీడా సంస్థలు వివిధ క్రీడలలో పాల్గొనడాన్ని ప్రోత్సహించడానికి ఇంటర్-స్కూల్ మరియు ఇంటర్-కాలేజ్ పోటీలు, క్రీడోత్సవాలు నిర్వహిస్తాయి.

