
హైదరాబాద్ కూకట్ పల్లి లోని ఇందు ఫార్చ్యూన్ ఫీల్డ్ విల్లా కమ్యునిటీలో గణపయ్య ఘనంగా పూజలందుకున్నాడు. “మా ఊరి పెద్దాయన” అనే కాన్సెప్టుతో గ్రామీణ వాతావరణం ఏర్పాటు చేసి అందులో మట్టి గణపయ్యను ప్రతిష్టించి ఐదు రోజులపాటు ఎంతో వేడుకగా పూజలు నిర్వహించారు. పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ పూజలకు హాజరై గణపయ్యను సేవించారు. హోమంతో మొదలై లడ్డూ వేలం వరకు ప్రతి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.


గణపతి లడ్డూని విల్లా నంబర్ 296 కి చెందిన గణేష్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ సంస్థకు చెందిన కనకమహాలక్ష్మి రూ. 3.15 లక్షలకు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం వినాయక విగ్రహాన్ని అసోసియేషన్ కు అందిస్తున్న చింతలకుంట్ల స్వప్న మాధవ్ లను కమిటీ సన్మానించింది. ఇక ఈ కార్యక్రమం గురించి అసోషియేషన్ ట్రెజరర్ సుబ్బారావు జాగర్ల మూడి మాట్లాడుతూ… ఇందు ఫార్చ్యూన్ ఫీల్డ్ సహచర మిత్రులందరికీ మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు. పండుగలు – పబ్బాలు, ఉత్సవాలు – ఊరేగింపులు మన భారతీయ సంస్కృతిలో ఒక భాగం. ఈ పండుగలు మన జీవన విధానానికి ప్రతీకలు. ప్రత్యేకించి, ఈ గణేష్ చతుర్థి ఉత్సవాలు మన సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన ప్రజలందరినీ ఒక తాటిమీదకు తెచ్చేందుకు చక్కని మార్గంగా దోహదపడుతున్నాయి. ఆనాడు స్వతంత్ర సంగ్రామ సమయంలో ప్రజలందరూ ఐక్యమై బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడేందుకు బాలగంగాధర తిలక్ గణేష్ చతుర్థి ఉత్సవాలను ఒక చక్కని సందర్భంగా వినియోగించుకున్న విషయం మనకు తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా, ఈ గణేష్ ఉత్సవాలు మన మధ్య ఉన్న వైషమ్యాలు మరచిపోయి మనందరం ఒక్కటే అన్న భావనను కలుగజేస్తూ వస్తున్నాయి. ఎప్పటిలాగే, ఈ ఏడాది కూడా మన కాలనీలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించుకోగలిగాం. ఇందుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా మన కమ్యూనిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని తెలిపారు. వినాయక ఉత్సవాలను విజయవంతం చేయడంలో మదన్ మోహన్ రావు,శ్యామల, సృజన, కిషన్ రావు, సాయిబాబా, చింతలకుంట్ల స్వప్న మాధవ్, ఝాన్సి, ఇందిర మరియు గణేష్ కమిటీ సభ్యులు సహకారం అందించారని తెలిపారు.


