
అక్రమ నిర్మాణాల కూల్చివేతలో హైడ్రా వేగంగా దూసుకుపోతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో 262 అనధికార నిర్మాణాలను కూల్చివేసిన ఘనతను సాధించింది. దీంతో దాదాపు 111.72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గత రెండు నెలలుగా అక్రమనిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా అమీన్ పుర్ లో అత్యధికంగా 51 ఎకరాల్లో అక్రమనిర్మాణాలు జరిగాయని తెలిపింది. మాదాపూర్ సున్నం చెరువు పరిధిలోని పది ఎకరాల్లో దాదాపు 42నిర్మాణాలను తొలగించారని హైడ్రా వెల్లడించింది. మరోవైపు ఇకపై నీటివనరులకు సమీప ప్రాంతాల్లో నిర్మాణాలను చేపట్టాలనుకునే బిల్డర్లు కొత్త నిబంధనల ప్రకారం హైడ్రా నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. ఈ నిబంధన ద్వారా అక్రమ నిర్మాణాలను ఆదిలోనే తొక్కిపెట్టొచ్చన భావనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

