Tuesday, April 14, 2026

ఇంగ్లాండ్ తో మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత్ పరాజయం

ఇంగ్లాండ్ తో మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత్ పరాజయం

Share

తొలి రోజు నుంచే అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శన…. రెండు ఇన్నింగ్స్ లో కలిపి 835 పరుగులు… గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఐదు సెంచరీలు… బుమ్రా అద్భుత బౌలింగ్ ప్రదర్శన…. అన్నీ సానుకూలతలే కనిపించినా… చివరకు ఓటమి మాత్రం తప్పలేదు. తొలి టెస్టుల్లో పలు సందర్భాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన భారత్ తుది దశకు వచ్చేసరికి చేతులెత్తేసింది. గెలుపు కోసం చివరి రోజు 350 పరుగుల భారీ స్కోరు చేయాల్సిన ఇంగ్లండ్ మొదటి ఓవర్ నుంచే పరుగుల
వేటలో పడింది.
వ్యూహాత్మకంగా బుమ్రా బౌలింగ్లో సాహసం చేయని బ్యాటర్లు ఇతర బౌలర్లపై చెలరేగి జోరుగా సాగిపోయారు. తాము ఆశించిన రీతిలో ‘బజ్బాల్ శైలిలో ఎక్కడా తగ్గకుండా 4.54 రన్రేట్తో దూసుకుపోయిన ఇంగ్లండ్ ఘన విజయాన్ని అందుకుంది. డకెట్ మెరుపు సెంచరీకి క్రాలీ అండగా నిలవగా… చివర్లో రూట్ కీలక అర్ధ సెంచరీతో జట్టును నడిపించాడు. తొలి టెస్టులో ఓటమి పక్షాన నిలిచిన కొత్త కెవేటన్ శుభ్ర్మన్ గిల్ సిరీస్లో మున్ముందు ఎలాంటి ఫలితాలు రాబడతాడనేది. చూడాలి.


లీడ్స్: ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ ను భారత్ పరాజయంతో మొదలు పెట్టింది. హెడింగ్లీ మైదానంలో మంగళవారం ముగిసిన తొలి టెస్టులో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 371 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో చివరి రోజు 21/0తో ఆటను మొదలు పెట్టిన ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్లో 82 ఓవర్లలో 5 వికెట్లకు 373 పరుగులు చేసింది. బెన్ డకెట్ (170 బంతుల్లో 149; 21 ఫోర్లు, 1 సిక్స్), జాక్ క్లాలీ (126 బంతుల్లో 65, 7 ఫోర్లు) తొలి వికెట్కు 188 పరుగులు జోడించి బలమైన పునాది వేయగా… అఖర్లో జో రూల్ (84 బంతుల్లో 53 నాటౌట్; 6 ఫోర్లు), జేమీ స్మిత్ (55 బంతుల్లో 44 నాటౌట్: 4 ఫోర్లు, 2 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్ ఆడారు.

రూట్, స్మిత్ ఆరో వికెట్కు అభేద్యంగా 71 పరుగులు జత చేశారు. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ పని పట్టిన స్టార్ పేసర్ బుమ్రా రెండో ఇన్నింగ్స్లో పరుగులు ఇవ్వకుండా కట్టడి చేయగలిగినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇతర బౌలర్ల పేలవ ప్రదర్శన ఇంగ్లండ్కు గెలుపు అవకాశాలు సృష్టించింది. ఈ విజయంతో సిరీస్లో ఇంగ్లండ్ 1-0తో ముందంజ వేసింది. సిరీస్లో రెండో టెస్టు జూలై 2 నుంచి బర్మింగ్హమ్లో జరుగుతుంది.


భారీ భాగస్వామ్యం…

ఇంగ్లండ్ ఓపెనర్లు క్రాలీ, డకెట్ చివరి రోజు ఆటను జాగ్రత్తగా మొదలు పెట్టారు. అయితే నిలదొక్కుకున్న తర్వాత వీరిద్దరు చక్కటి షాట్లతో ధాటిని పెంచారు. ఈ క్రమంలో ముందుగా 66 బంతుల్లో డకెట్ హాఫ్ సెంచరీ పూర్తయింది. 42 పరుగుల వద్ద క్రాలీ ఇచ్చిన కఠినమైన రిటర్న్ క్యాచ్ను అందుకోవడంలో బుమ్రా విఫలమయ్యాడు. లంచ్ వరకు కూడా ఇంగ్లండ్ ఓపెనింగ్ జోడీని విడదీయడంలో భారత్ విఫలమైంది.
తొలి సెషన్ ఇంగ్లండ్ 24 ఓవర్లలో 96 పరుగులు సాధించింది. విరామం తర్వాత 111 బంతుల్లో క్రాలీ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాత వీరిద్దరు మరింత జోరుగా ఆడారు. 97 పరుగుల వద్ద డకెట్ ఇచ్చిన క్యాచ్ జైస్వాల్ వదిలేయడం కూడా జట్టుకు కలిసొచ్చింది. తర్వాతి ఓవర్లోనే డకెట్ 121 బంతుల్లో కెరీర్లో ఆరో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత స్వల్ప వర్షం కారణంగా దాదాపు ఇరవై నిమిషాల పాటు ఆటకు అంతరాయం కలిగింది.

గెలిపించిన రూట్, స్మిత్…
వాన ఆగిన తర్వాత భారత్కు సానుకూల ఫలితం వచ్చింది. ఎట్టకేలకు క్రాలీని అవుట్ చేసి భారత్కు తొలి వికెట్ అందించిన ప్రసిద్… తన తర్వాతి ఓవర్లోనే ఒలీ పోప్ (8)ను కూడా పెవిలియన్ పంపించాడు. ఈ దశలో డకెట్, రూట్ మళ్లీ ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తూ మూడో వికెట్కు 47 పరుగులు జోడించారు. ఇంగ్లండ్ వేగంగా దూసుకుపోతున్న తరుణంలో శార్దుల్కు బంతి అప్పగించడం భారత్కు
మేలు చేసింది.
దూకుడుగా ఆడుతున్న డకెట్తో పాటు హ్యారీ బ్రూక్ (0)ను వరుస బంతుల్లో అవుట్ చేసి శార్దుల్ ఒక్కసారిగాటీమిండియా శిబిరంలో ఉత్సాహం నింపాడు. అయితే రూట్, బెన్ స్టోక్స్ (51 బంతుల్లో 33; 4 ఫోర్లు) కలిసి జట్టును విజయం దిశగా నడిపించారు. వీరిద్దరు 77 బంతుల్లో 49 పరుగులు జత చేశారు. అయితే జడేజా బౌలింగ్ పదే పదే రివర్స్ స్వీప్కు ప్రయత్నించిన స్టోక్స్ అదే షాట్ ఆడి నిష్క్రమించాడు. ఈ దశలో ఇంగ్లండ్ మరో 69 పరుగులు చేయాల్సి ఉండటంతో భారత బృందంలో కాస్త
ఆశలు రేగాయి.


స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: 471; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 465; భారత్ రెండో ఇన్నింగ్స్: 364;

ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలీ (సి) రాహుల్ (బి) ప్రసిద్ 65; డకెట్ (సి) (సబ్) నితీశ్ రెడ్డి (బి) శార్దుల్ 149; పోప్ (బి) ప్రసిద్ 8; రూట్ (శనాటౌట్) 53; బ్రూక్ (సి) పంత్ (బి) శార్ధుల్ 0; స్టోక్స్ (సి) గిల్ (బి) జడేజా 33; స్మిత్ (నాటౌట్) 44; ఎక్స్ట్రాలు 21; మొత్తం (82 ఓవర్లలో 5 వికెట్లకు) 373. వికెట్ల పతనం: 1-188, 2-206, 3-253, 4-253, 5-302. బౌలింగ్: బుమ్రా 19-3-57-0, సిరాజ్ 14-1-51-0, జడేజా 24-1-104-1, ప్రసిద్ 15-0-92-2, శార్దుల్ 10-0-51-2.


5 ఒక టెస్టులో ఐదు సెంచరీలు నమోదు చేసిన తర్వాత కూడా ఓటమి పాలైన తొలి జట్టుగా భారత్
నిలిచింది.
2 టెస్టుల్లో ఇంగ్లండు ఇది రెండో అతి పెద్ద ఛేదన. 2022లో భారత్పైనే బర్మింగ్హామ్లో 378 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది.
6 హెడింగ్లీ మైదానంలో ఇంగ్లండ్ వరుసగా ఆరో టెస్టు గెలిచింది. ఈ ఆరు సార్లు జట్టు లక్ష్యాలను ఛేదించడం విశేషం.
3 టెస్టు మ్యాచ్ నాలుగు ఇన్నింగ్స్ లోనూ 350కు పైగా స్కోర్లు నమోదు కావడం ఇది మూడోసారి మాత్రమే.

Read more

Local News