అందరూ ఉత్కంఠతో ఎదురుచూసిన బాలాపూర్ లడ్డూ వేలం ముగిసింది. చివరి వరకూ పోటాపోటీగా సాగిన వేలం పాటలో 30లక్షల వెయ్యి రూపాయలకు కొలన్ శంకర్ రెడ్డి అనే వ్యక్తి లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. గత ఏడాది 27లక్షలకు దాసరి దయానందరెడ్డి లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకోగా ఈ సారి అదనంగా మూడులక్షల అధిక ధర పలికింది. బాలాపూర్ లడ్డూ వేలం పాట ప్రారంభించి నేటికి 30ఏళ్ళు విజయవంతంగా పూర్తయింది.

1994లో తొలిసారిగా 450 రూపాయలతో ప్రారంభమైన లడ్డూ వేలం 2016లో రూ.14.65లక్షలు చేరి రికార్డు నెలకొల్పింది. అనంతరం 2017లో రూ.15.60లక్షలు, 2018లో రూ.16.60 లక్షలు, 2019లో 17.60 లక్షలకు చేరింది. అయితే 2020లో కరోనా కారణంలా వేలం పాటను రద్దుచేశారు. తిరిగి 2021లో రూ.18.90 లక్షలు
2022లో రూ.24.60 లక్షలు పలికింది. అయితే ఈ సంవత్సరం వేలం పాటలో సరికొత్త నిబంధనలను ప్రవేశపెట్టారు. పోటీదారులు ముందుగా డబ్బును డిపాజిట్ చేయాలని షరతు విధించగా 23మంది వేలంలో పాల్గొన్నారు. కొలన్ శంకర్ రెడ్డితో పాటు, ప్రణీత్ రెడ్డి, దశరథ్ గౌడ్, లక్ష్మీనారాయణలు చివరివరకూ లడ్డూను దక్కించుకునేందుకు గట్టిగా పోటీపడ్డారు. ఆఖరికి 30లక్షల వెయ్యిరూపాయలకు కొలను శంకర్ రెడ్డి ప్రసాదాన్ని దక్కించుకున్నారు. వేలం పాట అనంతరం బాలాపూర్ గణేష్ శోభాయత్ర ప్రారంభమైంది. హైదరాబాద్ లో సుమారు 21 కిలోమీటర్లు ఊరేగింపుగా వచ్చే బాలాపూర్ శోభాయాత్రే అతిపెద్దది. దీనికోసం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా దాదాపు 700లకు పైగా సీసీ కెమెరాలను శోభాయాత్ర మార్గంలో ఏర్పాటుచేశారు.

