పుట్టిన ఆడశిశువును కన్నవారే అమ్ముకున్న మరోవైనం గుంటూరు జిల్లాలో బయటపడింది. బాపట్ల జిల్లా చినగంజాకు చెందిన లక్ష్మి అనే మహిళ చీరాలలో ఆడశిశువుకు జన్మనిచ్చింది. రెండువారాల క్రితం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి ఆమె మరణించింది.ఇదే ఆస్పత్రిలో భట్టిప్రోలుకు చెందిన మీరాబి అనే మహిళ కొద్దిరోజుల క్రితం ఓ శిశువుకు జన్మనివ్వగా ఆ పసికందు పురిటిలోనే మృతిచెందింది. అయితే మీరాబీ దగ్గర మరో ఆడ శిశువు ఉండటాన్ని గమనించిన జీజీహెచ్ గైనకాలజిస్ట్ జయంతి విషయం ఐసీడీఎస్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మీరాబీ స్నేహితురాలు ప్రభావతి అదే ఆస్పత్రిలో లక్ష్మి మృతిచెందిదన్న విషయం తెలుసుకుని ఆమె భర్త సుబ్రమణ్యంను కలిసింది. అప్పటికే ఎనిమిదిమంది సంతానం ఉన్న సుబ్రమణ్యం ప్రభావతి అడిగిన విధంగా పుట్టిన ఆడబిడ్డను విక్రయించేందుకు ఒప్పుకున్నాడు. దీంతో రూ.1.90 లక్షలు చెల్లించిన ప్రభావతి ఆ ఆడ శిశువును మీరాబీకి అప్పగించినట్లు పోలీసుల విచారణలో తేలింది. అనధికారికంగా బిడ్డను కొనుగోలు చేయడం నేరంగా పరిగణించిన పోలీసులు శిశువును స్వాధీనం చేసుకుని శిశు సంక్షేమ వసతి గృహ కేంద్రానికి తరలించారు.

