Tuesday, April 14, 2026

మారేది ఉందా లేదా…?

రోజులు మారుతున్నాయి.. వాటితోపాటు తరాలు మారుతున్నాయి. పాతనీరు పోయి కొత్తనీరు చేరుతోంది.. కానీ ఈ క్రమంలో ఏం పోగొట్టుకుంటున్నామో తెలుసా? చాపకింద నీరులా మనం గుర్తించేలోపే ఆనాటి తరం వెళ్ళిపోతోంది. మన జ్ఙాపకాల మూటల్ని మోసుకుంటూ ప్రేమగల ఆ పెద్దరికం కనుమరుగైపోతోంది. ఆ తరం వెళ్ళి పోతోంది.. ఆ ప్రేమ... కనుమరుగైపోతోంది.. పాతరోత కొత్త మోత అనుకుంటూ హడావిడిగా ఈ తరం పరుగులు పెడుతుంటే జ్ఙాపకాలన్నీ పోగేసుకుని బహుదూరపు బాటసారై ఆ తరం పయనం ముగిస్తోంది. ఇది మంచి ఇది చెడు అని చెప్పే పెద్దరికం, విలువలు కలిగిన హుందాతనం, ఏదైనా వస్తే ముందుండి నడిపించే ఆ ధైర్యం, ఏం వచ్చినా చూసుకుందాంలే అనే నమ్మకం.. అన్నీ కనుమరుగైపోతున్నాయి.. కల్మషం లేని మనసు, విలువలతో కూడిన బతుకు, శ్రమతో నిండిన జీవనం ఇదే ఆ తరానికి తెలిసిన జీవితం. ప్రేమఅనురాగాలతో నిండిన పలకరింపులు, కష్టంలో కూడా చెక్కుచెదరని చిరునవ్వు, మాటతప్పని నీతినియమాలు, వేషభాషలలో వేలెత్తి చూపలేని హుందాతనం, విజ్ఞానం, వినోదం ఇలా ఎందులోనూ తీసిపోని ఒక నాటి మన పెద్దతరం క్రమంగా కనుమరుగైపోతోంది. మరి మనతరానికి ఆ విలువలు తెలిసేనా? నా కుటుంబం, నా ఉద్యోగం, నా ఆస్తులు, నాఅభివృద్ధి ఇలా నా నా అనుకుంటున్న ఈ తరానికి ఇది కాదు.. జీవితం అంటే ఇలా బతకడం కాదు.. అని చెప్పే ఆ తరం ఏది? ఎలాంటి సమస్యలు ఎదురైనా అందరూ కలిసి ఉంటే ఏదైనా అధిగమించవచ్చు అని ఆ తరం బతికి చూపించినా మన కళ్ళకు కనబడడం లేదు.. అందుకే నానాటికి దిగజారిపోతున్న సమాజంలో ఇక నా అవసరం మీకు లేదంటూ వయో భారంతో ఆ తరం అంతరించి పోతుంటే ఇక మన తరానికి దిక్సూచి ఏది?

Share

Read more

Local News