కాబోయే మన కలెక్టర్లను వారి ఇంటికి వెళ్లి సన్మానించిన రాష్ట్ర సంఘం నాయకులు
సన్మాన అనంతరం పెరిక విద్యాజ్యోతి కార్యక్రమాన్ని ప్రకటించిన రాష్ట్ర పెరిక సంఘం పెద్దలు
సివిల్స్, గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఇక ఉచిత వసతి, ఉచిత శిక్షణ
ఇటీవల ప్రకటించిన UPSC ర్యాంకుల్లో ఆల్ ఇండియా 11 వ ర్యాంకు, తెలుగు రాష్ట్రాల్లో మొదటి ర్యాంకు సాధించిన ఇట్టేబోయిన సాయి శివాని, 255 వ ర్యాంకు సాధించిన పోతరాజు హరిప్రసాదులను వరంగల్లో గురువారం రాష్ట్ర పెరిక సంఘం నాయకులు, ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు కలిసి ఘనంగా సన్మానించారు.
మొదట వరంగల్ శివనగర్ ప్రాంతంలో ఉండే సాయి శివాని ఇంటికి వెళ్లి మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్న ఆమె తండ్రి రాజు, తల్లి రజనిని కలిసి అభినందించి శుభాకాంక్షలు తెలియచేసారు.
దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన రాజు తన కూతురిని ఐఏఎస్ అధికారిగా చూడాలని కల కనడం, ఆ కలను తన కూతురు నిజం చేయడం ఎంతో అభినందనీయమని సంఘం నాయకులు వారిని కొనియాడారు,
ఎలాంటి కోచింగ్ లేకుండా ఇంటి వద్దనే ప్రిపేర్ అయ్యి టాప్ ర్యాంక్ సాధించడం అసాధారణ విషయమని, ఇది యావత్ పెరకజాతి గర్వించదగ్గ సందర్భమని నాయకులు తెలిపారు.
ఆ తర్వాత బాలసముద్రంలో ఉండే పోతరాజు సాయి ప్రసాద్ ఇంటికి చేరుకొని, అతని తండ్రి తెలుగు పండిట్ ఆయన కిషన్, తల్లి విజయను నాయకులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ ఇద్దరు పిల్లలు పెరిక జాతి చరిత్రలోనే ఐఏఎస్ సాధించిన మొదటి వారుగా నిలవనున్నారని నాయకులు ఈసందర్బంగా తెలిపారు.
అనంతరం జరిగిన సమావేశంలో పెరిక కుల ఆత్మగౌరవ భవన కమిటీ చైర్మన్ గటిక విజయకుమార్ మాట్లాడుతూ, పెరిక బిడ్డల అభ్యున్నతికి రాష్ట్ర నాయకత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
పెరిక కుల బిడ్డలు భవిష్యత్తులో మరిన్ని సివిల్ సర్వీస్ ర్యాంకులు, గ్రూప్ వన్ ర్యాంకులు సాధించడానికి వీలుగా విద్యా జ్యోతి కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లు ప్రకటించారు.
సివిల్ సర్వీస్, గ్రూపు వన్ పరీక్షల్లో ప్రిలిమ్స్ ఉత్తీర్ణులై మెయిన్స్ అర్హత సాధించిన విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు.
మెయిన్స్ కు ప్రిపేర్ అయ్యేవారికి హైదరాబాదులో సౌకర్యవంతమైన ఉచిత వసతితో పాటు, ఉచిత భోజనం అందిస్తామని ప్రకటించారు వారి ట్యూషన్ ఫీజులు కూడా రాష్ట్ర పెరిక సంఘం నాయకులు భరిస్తారని చెప్పారు. ఈ సదుపాయాన్ని పెరిక విద్యార్థులు సద్వినియోగం చేసుకొని జీవితంలో వారు అనుకున్న లక్ష్యానికి చేరుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర పెరిక సంఘం, పెరిక విద్యార్థి వసతి గృహం, పెరికకుల సంక్షేమ సమితి, కోకాపేట ఆత్మ గౌరవ భవన నిర్మాణ కమిటీ, పెరిక కుల పరపతి సంఘం సంయుక్తంగా విద్యా జ్యోతి కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని ప్రకటించారు.
సివిల్స్ టాప్ యాంకర్ల సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర పెరిక సంఘం అసోసియేట్ అధ్యక్షుడు సుంకరి ఆనంద్, కోశాధికారి దొంగరి మనోహర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి కీత విజయ్ కుమార్, పెరిక విద్యార్థి వసతిగృహం అధ్యక్షుడు డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి అచ్చ రఘుకుమార్, సీనియర్ జర్నలిస్ట్ మైలార్శెట్టి చైతన్య, పెరిక విద్యార్థి వసతి గృహం గౌరవ సలహాదారుడు చింతకుంట్ల శ్యామ్ కిరణ్, పెరిక సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చింతం ప్రవీణ్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి శ్రీనివాస్, పెరిక విద్యార్థి వసతిగృహం ఉపాధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస వర్మ, సంయుక్త కార్యదర్శి అల్లం రాజేష్ వర్మ, పెరికథాద్రి ఎడిటర్ బరుపాటి సంపత్, లీగల్ సెల్ కన్వీనర్ అల్లం నాగరాజు, ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు చింతకుంట్ల మాధవ్, బిల్లా పవన్, బరుపాటి గోపి , డాక్టర్ అత్తే భగీరథ, చింతల యాదగిరి, ముతినేని సురేష్, అవిరే వెంకటేశ్వర్లు, చుంచు నరసింహమూర్తి, తీర్థాల పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.




