
కాకినాడ జీజీహెచ్ వైద్యులు ఓ మహిళా రోగికి అరుదైన రీతిలో శస్త్రచికిత్స చేసి విజయం సాధించారు. తొండంగి మండలం ఏ.కొత్తపల్లికి చెందిన 55ఏళ్ళ అనంతలక్ష్మికి మెదడులో ఎడమవైపు 3.3×2.7 సెం.మీల పరిమాణంలో కణతి ఉన్నట్లు గుర్తించిన వైద్యులు ‘అవేక్ క్రానియోటమీ’ విధానం ద్వారా దాన్ని తొలగించారు. ఈ శస్త్రచికిత్సను తక్కువ అనస్తీషియాతో ఆమె మెలకువలో ఉండగానే పూర్తిచేశారు వైద్యులు.. పేషెంట్ కు ఇష్టమైన అదుర్స్ సినిమా లోని ఎన్టీఆర్ బ్రహ్మనందం కామెడీ సీన్లను చూపిస్తూ ఆమె ఆనందంగా ఉన్న సమయంలో నొప్పితెలియకుండా మెదడులోని కణతిని తొలగించారు. దాదాపు రెండున్నర గంటలపాటు సాగిన ఈ సర్జరీ విజయవంతం అయ్యిందని ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఐదు రోజుల తర్వాత ఆమె డిశ్చార్జ్ చేస్తామని అన్నారు. ఇలాంటి క్లిష్టమైన సర్జరీని కాకినాడ జీజీహెచ్ లో చేపట్టడం ఇదే తొలిసారి కావడంతో ఈ విజయంపై పలువురు వైద్య నిపుణులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

