చంద్రయాన్-3 ప్రయోగం విజయంతో చంద్రుని సౌత్ పోల్ పై కాలు మోపిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. అంతే కాకుండా చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా అడుగు పెట్టిన యునైటెడ్ స్టేట్స్, చైనా, రష్యా తర్వాత భారత్ నాల్గవ దేశంగా అవతరించింది.

ఇస్రో ఇప్పటికి ఆరు రకాల వాహక నౌకలు రూపొందించి 97 ప్రయోగాలు చేపట్టింది.. చిన్న ప్రయోగాల నుంచి చంద్రయాన్-1, మంగళయాన్, ఆదిత్య-ఎల్ 1 వంటి భారీ ప్రయోగాలను విజయవంతంగా చేపట్టింది.చంద్రయాన్-2 చివరి నిమిషంలో విఫలమైనా చంద్రయాన్-3 ప్రయోగం ద్వారా సాప్ట్ ల్యాండింగ్ చేయడంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. భవిష్యత్లో గగన్యాన్ ద్వారా మానవుడిని అంతరిక్షం లోకి పంపడమే ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. మూడు రోజుల మిషన్ కోసం ముగ్గురు బృందాన్ని 400 కిలోమీటర్ల కక్ష్యలోకి ప్రవేశపెట్టి, భారత సముద్రంలోకి దిగడం ద్వారా వారిని సురక్షితంగా భూమికి తీసుకురావాలని ఈ ప్రాజెక్టు భావిస్తోంది. మరోవైపు భారత్ మానవ సహిత చంద్ర యాత్రకు ప్రయత్నిస్తుందని ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు.

